శేరిలింగంపల్లిలో SIR-2026 సమీక్ష.. క‌చ్చితమైన ఓటరు జాబితాపై ERO నారాయణ్ అమిత్ ఆదేశాలు

శేరిలింగంప‌ల్లి, జూలై 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమం పురోగతిపై ERO, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అంద‌రు AEROలు, నోడల్ అధికారులు, BLO సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. సమావేశంలో ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్, పోలింగ్ స్టేషన్‌ల వారీగా పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. ఫారం-6, 7, 8, 8ఏ దరఖాస్తుల సేకరణ అనంతరం వాటిని వెంటనే డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని ERO అధికారులకు సూచించారు.

నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్‌ల పనితీరును సమీక్షించిన నారాయణ్ అమిత్, పురోగతి మందగించిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న సందేహాలు, ఎదురవుతున్న సవాళ్లపై అధికారులతో చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. AEROలు, నోడల్ అధికారులు, BLO సూపర్‌వైజర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయి కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. రోజువారీ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా 100 శాతం క‌చ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని, ప్రజల భాగస్వామ్యంతో SIR-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ERO నారాయణ్ అమిత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here