శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల నుంచి గోపన్‌పల్లి వరకు ఇస్కాన్ సైబరాబాద్ (హరే రామ హరే కృష్ణ) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఇస్కాన్ నిర్వహించే జగన్నాథ రథయాత్ర జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి మహిమను ప్రపంచానికి చాటిచెప్పే మహోన్నత ఆధ్యాత్మిక ఉత్సవమని అన్నారు. అలంకరించిన భారీ రథాలను భక్తులు భజనలు, హరినామ సంకీర్తనల మధ్య లాగుతూ నిర్వహించే ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆధ్యాత్మికంగా ఏకం చేస్తుందని తెలిపారు.

ఈ పవిత్రమైన రోజున జగన్నాథుడు తన ఆలయం నుంచి బయటకు వచ్చి కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిపై తన కరుణా కటాక్షాలను ప్రసాదిస్తాడని పేర్కొన్నారు. రథయాత్ర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా, దైవిక ప్రేమ, భక్తి, విరహ భావానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. రథాన్ని లాగడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని వివరిస్తూ, జగన్నాథుని రథపు తాళ్లు భగవంతుడిని మన జీవితాల్లోకి ఆహ్వానించాలనే హృదయపూర్వక ఆకాంక్షకు ప్రతీకగా ఉంటాయని అన్నారు. భక్తులు రథాన్ని లాగుతూ జగన్నాథ స్వామి తమ జీవితాల్లోని అడ్డంకులను తొలగించి, హృదయాలను పవిత్రపరచి, ప్రేమపూర్వక భక్తి సేవ ద్వారా తనను తాను స్థాపించుకోవాలని ప్రార్థిస్తారని వివరించారు. భగవంతుడు తన భక్తుల ప్రేమను ఎల్లప్పుడూ ఆదరిస్తాడనే సందేశాన్ని రథయాత్ర మనకు గుర్తు చేస్తుందని ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, దూబే, అనిల్, ప్రభాకర్ రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





