శేరిలింగంపల్లి, జూన్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన అనేక మందికి AYUV స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం రక్తదాతలను సమకూర్చుతూ సేవలు అందిస్తున్న నేపథ్యంలో, ఫౌండేషన్ సేవలను గుర్తిస్తూ ESI ఆసుపత్రి అధికారులు బెస్ట్ బ్లడ్ డోనర్ సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా AYUV స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రోహిత్ ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు. యువత సేవా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని ఆసుపత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. అనంతరం రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే రక్తదాన సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో AYUV ఫౌండేషన్ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు, యువత పాల్గొన్నారు.






