శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ వైద్యులను సత్కరించి వారి సేవలను గుర్తించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని భావిస్తున్నట్లు ప్రసాద్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డి.ఎస్.ఆర్.కే. ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి, ప్రసాద్స్ ఫౌండేషన్ డైరెక్టర్ దోనేపూడి రమాదేవితో కలిసి ప్రముఖ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎం. భార్గవి చౌదరి ఆరెకపూడిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మొవ్వ రమ్యశ్రీని కూడా కలిసి శాలువాతో సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దోనేపూడి రమాదేవి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శాలువాలతో ఇరువురు వైద్యులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా డి.ఎస్.ఆర్.కే. ప్రసాద్ మాట్లాడుతూ ప్రముఖ వైద్యులను సన్మానించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. కనిపించని దేవుడిని ఎలా పూజిస్తామో, కనిపించే దేవుడి రూపమే ఈ డాక్టర్లని, వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతున్న వీరిని గౌరవించడం సమాజం బాధ్యత అని అన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వైద్యులను సత్కరించడం ద్వారా వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.కే. చౌదరి, వినోద్ చౌదరి, శ్రీకాంత్, కమలాకర్ రెడ్డి, చిన్నా, పెదబాబు, రవి, తులసి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






