శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ జోన్, నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ వార్డులో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పౌర సమస్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమైన అధికారులు, వార్డు పరిధిలోని మౌలిక వసతులు, ప్రజా సేవలపై వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. పార్కుల నిర్వహణ, వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారుల ఆట పరికరాలు, డ్రైనేజీ పొంగిపొర్లడం, మురుగునీటి సమస్యలు, నీటి నిల్వ, వీధి దీపాల నిర్వహణ, రోడ్లపై గుంతల మరమ్మత్తులు, రోడ్ల పునరుద్ధరణ, ట్రాఫిక్ భద్రత, రోడ్డు ఆక్రమణల తొలగింపు, పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ, వీధి కుక్కల సమస్య, శ్మశానవాటికలో మౌలిక వసతులు, ప్రజా రవాణా సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ప్రస్తావించిన ప్రతి సమస్యను సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వార్డులో పౌర సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతోపాటు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.






