చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ కాలనీలో నెలకొన్న వర్షపు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సోమవారం కాలనీవాసులతో కలిసి జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. వర్షం పడినప్పుడు కాలనీలో వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం ఉండడం లేదని, దీంతో రహదారులపై 2, 3 అడుగుల ఎత్తున నీరు నిల్వ ఉంటుందని అన్నారు. దీని వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. అలాగే 6 ఇంటర్నల్ రోడ్లకు అడ్డంగా ఓ బిల్డర్ ప్రహరీ గోడను నిర్మించాడని, దీంతో వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ సదరు బిల్డర్‌తో మాట్లాడి కాలనీ వాసుల సమస్యను పరిష్కరించాలని జడ్‌సీని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటామన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో లింగారెడ్డి, ఆశి రెడ్డి, రామారావు, మహేందర్ రెడ్డి, హమీద్ తదితరులు ఉన్నారు.
పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో వర్షపు నీటి లీకేజీని అరికట్టండి…
చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో పై కప్పు పగిలి వర్షం పడినప్పుడు అందులో నుంచి నీరు లీకవుతుందని, దీంతో కింద ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులోని సింథటిక్ మ్యాట్స్ పాడవుతున్నాయని, కనుక ఇండోర్ స్టేడియం పైకప్పుకు మరమ్మత్తులు చేసి వర్షపు నీటి లీకేజీని అరికట్టాలని కోరుతూ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి సోమవారం జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.