మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పరిధిలోనీ నడిగడ్డ తండా వాసులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మాదాపూర్ జోన్ డీసీపీ, మియాపూర్ డివిజన్ ఏసీపీ, మియాపూర్ సీఐలకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము స్థానికంగా గత 50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నామని తెలిపారు.
గత 4 ఏళ్ల నుంచి సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది తమ తండా వద్ద పక్కన గుడారాలు నిర్మించుకుని చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని తెలిపారు. తాము బస్తీలో ఇళ్లకు మరమ్మత్తులు చేసుకుంటే సీఆర్‌పీఎఫ్ వారు వచ్చి తమను బెదిరిస్తూ తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని వాపోయారు. తండా వీధుల్లో వారు తిరుగుతూ తమను వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇండ్ల ముందుకు వచ్చి గేట్లను ఓపెన్ చేసి చూస్తున్నారని, దీని వల్ల తమ ఇండ్లలో ఉండే మహిళలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్ల పైకప్పు నుంచి వర్షం నీరు ఇంట్లో కురుస్తుందని తెలిపారు. వాటిని తిరిగి నిర్మించుకుందామంటే సీఆర్‌పీఎఫ్ వారు అడ్డు పడుతున్నారని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్‌ను తండాలోకి రానివ్వడం లేదని అన్నారు. కాగా నాయకుల సమస్యలకు స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు త్వరలోనే ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇస్లావత్ దశరథ్ నాయక్, స్వామి నాయక్, సీతారాం నాయక్, రెడ్యా నాయక్, లక్ష్మణ్ నాయక్, మధు, ఆంజనేయులు, రాంజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.