చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం పెద్దచెరువు లో కొనసాగుతున్న ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, బల్దియా కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. గంగారం పెద్ద చెరువు స్థలంలో 20 సంవత్సరాల క్రితం నిర్మాణాలు చేపట్టిన 63 మంది నిర్మాణదారులకి తమ కట్టడాలు బఫర్/ఎఫ్టీఎల్ లోకి వస్తాయని నోటీసులు ఇచ్చిన అధికారులు తాజాగా జరుగుతున్న ఆక్రమణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో ఎఫ్టీఎల్ పిల్లర్ తొలగించినందుకు ఓ అడ్వకేట్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారని, జీహెచ్ఎంసీ డ్రైనేజీ కోసం కందకం తోడితే దాని పక్కన భారీగా మట్టిని నింపి, నిర్మాణం చేస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఈమధ్య చెరువు రక్షణకోసం ఓ కాపలాదారుడిని పెట్టిందని, నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నావని అడిగితే, నాకు ఏమీ తెల్వదనడం కంచె చేను మేసిన చందంగా ఉందన్నిరు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రెండు ఆక్రమణలపై చర్యలు తీసుకొని, నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు.