గఫూర్ నగర్ ఇన్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం

శేరిలింగంప‌ల్లి, జూన్‌15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫూర్ నగర్ కాలనీలో నెలకొన్న ఇన్‌లెట్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను డీసీ బాలకృష్ణ, సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం, ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ గఫూర్ నగర్ కాలనీ ఇన్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపిస్తామని తెలిపారు. ఇన్‌లెట్ సరిగా లేకపోవడం, కుచించుకుపోవడం, చెత్తాచెదారం చేరడం వల్ల కాలనీలో మురుగు సమస్య తీవ్రంగా మారిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వరద నీరు సాఫీగా ప్రవహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని, ఇన్‌లెట్‌ను సరిచేసి డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో కాలనీ ముంపుకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వరద నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు.

ముంపు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి శాశ్వత పరిష్కారంగా ఇన్‌లెట్ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని అన్నారు. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌కు అవసరమైన మరమ్మత్తులు చేపట్టి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎయిర్‌టెక్ మిషన్ ద్వారా ప్రతి మ్యాన్‌హోల్‌లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన చోట మ్యాన్‌హోల్స్‌ను మరమ్మత్తులు చేసి వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. కాలనీ వాసులకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని, ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని గాంధీ హామీ ఇచ్చారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ ఈఈ గోవర్ధన్, ప్రాజెక్ట్స్ డీఈ ధీరజ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here