శేరిలింగంపల్లి, జూన్15 (నమస్తే శేరిలింగంపల్లి): దీప్తి శ్రీ నగర్లో ప్రధాన రహదారిపై కొనసాగుతున్న ఆక్రమణలపై జనం కోసం సంస్థ ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన జీహెచ్ఎంసీ మియాపూర్ ఉప కమిషనర్‌తోపాటు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. హ్యుందాయ్ సర్వీసింగ్ సెంటర్ పక్కన ప్రధాన రహదారిని అక్రమంగా ఆక్రమించి ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ యార్డ్‌ను తక్షణమే తొలగించాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దీప్తి శ్రీ నగర్ సీతారామయ్య మార్కెట్ యార్డ్ బోర్డును కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ మార్కెట్ కారణంగా కాలనీ వాసులు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగం రాజశేఖర్ తెలిపారు. ప్రజా రహదారులను ఆక్రమణల నుంచి రక్షించి, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని జనం కోసం సంస్థ విజ్ఞప్తి చేసింది.







