శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలమండలి ఈడీ సంతోష్ రెడ్డి, డైరెక్టర్ నారాయణ, జీఎంలు కృష్ణ, హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి పరిధిలోని వివిధ కాలనీల ప్రజల నుంచి అందిన వినతులను పరిగణనలోకి తీసుకుని అత్యవసర పనులపై వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రతి ఫిర్యాదుపై స్పందించి జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయడంతోపాటు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి కలుషితాన్ని నివారించి నాణ్యమైన మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్లో అవసరమైన మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు సేకరించినట్లు తెలిపారు. అత్యవసర పనులను ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడా మురుగునీరు పొంగిపొర్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత పైపులు ఉన్న ప్రాంతాల్లో వాటిని మార్చడం, అవసరమైన చోట కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడం, పెండింగ్ పనులను పూర్తి చేయడం, కొత్త యూజీడీ పైప్లైన్లు, మంచినీటి పైప్లైన్ల కోసం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీజీఎంలు శ్రీమన్నారాయణ, శ్రీనివాసరాజు, నరేందర్, శ్రీహరి, మేనేజర్లు సందీప్, విక్రమ్ రెడ్డి, సలోమీ, ప్రియాంక, అనిల్ తదితరులు పాల్గొన్నారు.





