అధిక ఫీజుల దోపిడీపై డీఈవోకు ఫిర్యాదు.. ఎమ్మెన్నార్ స్కూల్‌పై విచారణకు ఆదేశాలు..

శేరిలింగంపల్లి, జూన్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాల‌నీలోని ఎంఎన్ఆర్‌ ఇండో ఇంగ్లీష్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు, లేట్ ఫీజులు, ఎక్స్‌ట్రా కరిక్యులర్, స్పెషల్ ఫీజుల పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఏఐఎఫ్డీఎస్ (AIFDS) హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి నేతృత్వంలో సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పాఠశాల యాజమాన్యం ఫీజులు చెల్లించని విద్యార్థులను మానసికంగా వేధించడం, వారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి అవమానించడం, పరీక్షలకు అనుమతించబోమని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు.

అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా అధిక లేట్ ఫీజులు వసూలు చేస్తున్నారని, యూనిఫామ్‌లు, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను బహిరంగ మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలకు పాఠశాలలోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. వినతిని స్వీకరించిన జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్‌రావు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. వెంటనే విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల హక్కులు, మానసిక శ్రేయస్సుకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, హైదరాబాద్ కమిటీ సభ్యులు ఈశ్వర్, జేడీ గణేష్‌తోపాటు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here