ఓటరు జాబితా సవరణే లక్ష్యం: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంపల్లి, జూన్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చందానగర్‌లోని క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగిన ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వ‌నిప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి ర‌వికుమార్ యాద‌వ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఏలు ప్రతి రోజు బీఎల్ఓలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫామ్‌లు, అవసరమైన పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించి, సరైన సమాచారం నమోదు అయ్యేలా చూడాలని అన్నారు.

రాష్ట్ర నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఏలకు తమ బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలపై పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీల్లో బూత్‌ల ఏర్పాటు, యాప్ ద్వారా ఓటర్ల వివరాల నమోదు, ఫారాల పంపిణీ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే నెల రోజుల పాటు ప్రతి బీఎల్ఏ ఇంటింటి సర్వేలో పాల్గొని రోజువారీ వివరాలను పార్టీ నాయకత్వానికి అందజేయాలని ఆదేశించారు. సీనియర్ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జులు బీఎల్ఏలకు అండగా నిలవాలని కోరారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నాయకులు, కార్యకర్తలకు సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. డబుల్ ఓట్లు, దొంగ ఓట్లు తొలగించడం, ఓటు హక్కు లేని అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే బూత్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బీఎల్ఏలు ప్రతి రోజు ఫామ్‌-6, ఫామ్‌-7, ఫామ్‌-8 దరఖాస్తుల వివరాలను సేకరించి పార్టీ నాయకత్వానికి అందజేయాలని చెప్పారు.

సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే స్థానిక నాయకులకు తెలియజేయాలని, కార్యకర్తలకు పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, పదాధికారులు, బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here