శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆకస్మికంగా లింగంపల్లి అండర్‌పాస్, ప్రతిపాదిత మోడల్ రోడ్, బొటానికల్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించారు. వర్షాకాలంలో లింగంపల్లి అండర్‌పాస్ వద్ద ఏర్పడుతున్న నీటి నిల్వ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం ప్రతిపాదిత మోడల్ రోడ్ అభివృద్ధి పనులు, బొటానికల్ గార్డెన్ వద్ద ఫుట్‌పాత్‌ల పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుత మౌలిక సదుపాయాలను అంచనా వేసి, మెరుగుపరచాల్సిన అంశాలను గుర్తించారు. ప్రజా సౌకర్యాలు, రహదారి భద్రత, పట్టణ సౌందర్యాన్ని మరింత మెరుగుపరిచేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

లింగంపల్లి అండర్‌పాస్‌లో ప్రతి వర్షాకాలంలో ఎదురయ్యే నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం అమలు చేయాలని ఆదేశించారు. అలాగే మోడల్ రోడ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంతోపాటు, బొటానికల్ గార్డెన్ వద్ద పాదచారులకు సౌకర్యవంతమైన ఫుట్‌పాత్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులన్నింటినీ నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు. పనుల అమలు సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.





