శేరిలింగంపల్లి, మార్చి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని జోనల్ కార్యాలయంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి.శ్రీజన అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా చెత్త సేకరణలో భాగంగా ప్రతి ఇంటి నుంచి నేరుగా చెత్త తీసుకునే కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో భాగంగా ప్రతి షాపు యజమాని ఆటో డ్రైవర్ కు చెత్త ఇచ్చే విధంగా చేయాలని, లేకపోతే పెనాల్టీ విధించాలని నిర్ణయించారు. దీనిపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సూచించారు. ఇందుకు క్షేత్రస్థాయిలో చేపట్టే పారిశుద్ధ్య చర్యలే అత్యంత ప్రధానమన్నారు.

శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఇంజనీరింగ్ కి సంబంధించిన పలు సమస్యలపై కూడా మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ప్రతి పనిని లోతుగా పర్యవేక్షించి అమలు చేయాలని ఆదేశించారు. ఐటీ పరిశ్రమలకు శేరిలింగంపల్లి జోన్ వేదికగా ఉన్నందున ఆ స్థాయిలోనే రహదారుల నిర్వహణ జరగాలని, క్షేత్రస్థాయి సిబ్బంది చేపట్టే చర్యలే ఇందుకు ప్రధానమన్నారు. స్వీపింగ్ అనంతరం వెంటనే చెత్త కుప్పలు తొలగించాలని, ఫ్లె ఓవర్‌లపై మట్టి, ఇసుక, ఇతర వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. డీసీ నుంచి కింది స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని, లోటు పాట్లను సవరించుకుంటూ చక్కని పరిసరాలు నెలకొనేలా చూడాలన్నారు. ఈ మీటింగ్ లో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, అన్ని సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు, డీఈలు, ఎస్‌డబ్ల్యూఎంలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





