శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాలను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ బుధవారం సందర్శించారు. మియాపూర్ సర్కిల్ పరిధిలోని మైత్రినగర్‌లో ఫేజ్ 2 పార్క్‌లో ఆమె పర్యటించారు. ఆమె వెంట ఎస్డబ్ల్యూఎం డీఈఈ, ఏఈఈ, ఎస్ఎస్, రాంకీ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మియాపూర్ సర్కిల్లో కొనసాగుతున్న శానిటేషన్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. మైత్రినగర్‌లో సిల్వర్ రివర్ స్కూల్ పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న సిల్ట్‌ను తొలగించాలని, స్కూల్ యాజమాన్యం శుభ్రత కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైత్రి నగర్ శ్రీకర హాస్పిటల్ రోడ్డులో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, రహదారులపై గుంతలకు మరమ్మత్తులు చేపట్టాలని, శ్రీకర హాస్పిటల్ రోడ్డులో ప్రధాన డివైడర్‌కు పెయింట్ వేయాలని, మైత్రి నగర్ ఫేజ్ 2 పార్క్‌లో థీమ్ పెయింటింగ్ పనులు చేపట్టాలని, పిల్లల పార్కుల్లో మరిన్ని మెరుగైన వసతులను కల్పించాలని, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి కోతుల వల్ల కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని, కేబుల్స్ లేదా వైర్లను వేలాడకుండా సరిగ్గా నిర్వహించాలని, ఫుట్ పాత్‌లు లేదా సర్వీస్ రోడ్డులపై అక్రమంగా పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, పాఠశాలలు, కాలేజీలకు మంజూరు చేసిన భవన నిర్మాణ అనుమతులను మరోమారు తనిఖీ చేయాలని ఆదేశించారు.






