శేరిలింగంపల్లి, మార్చి 26 (నమస్తే శేరిలింగంపల్లి): దేశ జనాభాలో సగం ఉన్న బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సరైన అవకాశాలు కల్పించకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ అన్నారు. గురువారం చిక్కడపల్లిలో ఉన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలగౌని బాల్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు అంటే ఓట్లు వేసే యంత్రాలుగా జెండాలు మోసే కూలీలుగా , పల్లకీలు మోసే బోయీలుగా చూస్తున్నారు తప్ప బీసీలకు జనాభా దామాషా ప్రకారంగా రావలసిన వాటా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు, ముఖ్యంగా 33% మహిళా బిల్లులో బీసీ మహిళల సబ్ కోటా ఎంతో తేల్చాలి, మహిళా బిల్లులో బీసీ మహిళల సబ్ కోటా తేల్చకుండా అమలు చేస్తే మళ్లీ దొరల స్థానంలో దొరసానులు వస్తారు తప్పితే బీసీ మహిళలకు న్యాయం జరగదని అన్నారు.

అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జాతీయ జన గణనలో బీసీలను కులాల వారిగా గుర్తించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వెంటనే ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా ఓబీసీలపైన జరుగుతున్న దాడులు కుల బహిష్కరణలు దృష్టిలో పెట్టుకొని వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని, దేశంలో ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, మైనార్టీలకు గాని, అగ్రవర్ణాలకు గాని ఎవరికి లేని క్రిమిలేయర్ విధానాన్ని బీసీలపై నెట్టడం సరైన విధానం కాదని, వెంటనే బీసీలపై ఉన్న క్రిమిలేయర్ ని ఎత్తివేయాలని, నామమాత్రమైన ఓబీసీ కమిషన్ కాకుండా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ లకు ఏవిధంగా రాజ్యాంగబద్ధమైన హక్కు కల్పించారో, ఓబీసీ కమిషన్కు అలాగే రాజ్యాంగబద్ధమైన హక్కు కల్పించాలని , 42% బీసీ రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
దేశంలో 60 శాతం ఉన్న ఓబీసీల డిమాండ్ల సాధన కోసం పార్లమెంటులో ఉన్న బిసి పార్లమెంట్ సభ్యులు మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటైన అంశం, పార్లమెంట్ సమావేశాలు మొదలై 20 రోజులు అవుతున్నా బీసీ డిమాండ్లపై పార్లమెంటులో ఒక్కరోజైనా చర్చ జరగకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను విద్యాపరంగా ఉద్యోగ పరంగా రాజకీయపరంగా అణిచివేయాలని చూస్తే బిసి పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త బీసీ ఉద్యమాన్ని చేపట్టి అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్, పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్స్ బైరు శేఖర్, అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్ట విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ, బాలగోని వెంకటేష్, ఐలెన్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.





