శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధులుగా ఆంజనేయులు సాగర్, గోపాల్ రావులను నియమించారు. ఈ సందర్భంగా కొండాపూర్‌లోని మసీద్‌బండ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఎం. రవికుమార్ యాదవ్ నూతన అధికార ప్రతినిధులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వహిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, వ్యూహాత్మక ప్రణాళికలతో పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఎప్పుడూ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

నూతనంగా నియమితులైన ఆంజనేయులు సాగర్, గోపాల్ రావు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతాయుతమైన పదవులు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, అందరితో సమన్వయంగా పనిచేస్తూ పార్టీ సూచించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కనకయ్య, శ్రీనివాసులు, వేణు, వేణుగోపాలస్వామి, పద్మ, సైదమ్మ, నర్సింగ్, చందు, ఆంజనేయులు, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.





