శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, జనప్రియ నగర్ ఫేజ్-1, మాధవ్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీల్లో రూ.4 కోట్ల 9 లక్షల 7 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, శ్మశానవాటిక అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించి, సౌకర్యవంతమైన రవాణా కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జనప్రియ నగర్ ఫేజ్-1, మాధవ్ నగర్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్య శేరిలింగంపల్లి లక్ష్యంగా ప్రతి కాలనీ, పార్కులో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసి ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందిస్తామని చెప్పారు. అంబేద్కర్ నగర్‌లోని శ్మశానవాటికను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దహనవాటిక, స్నానపు గదులు, విశ్రాంతి గదులు, ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రశాంత వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.





