శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు, ఈర్ల చెరువులను సుందరశోభిత వనాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. Nexus Select Malls సంస్థ CSR నిధులతో మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఇరిగేషన్, CMC ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైదమ్మ కుంట, ఈర్ల చెరువుల పునరుద్ధరణతో ప్రాంత దశదిశలు మారనున్నాయని పేర్కొన్నారు. వర్షాకాలం లోపే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. చెరువులను సుజల జలాలతో అపురూప దృశ్యకావ్యాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

కైదమ్మ కుంట పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం కలిసి పనిచేస్తే పర్యావరణ పరిరక్షణలో ఎంతటి మార్పు సాధ్యమో చూపించే ఆదర్శ ప్రాజెక్టుగా నిలుస్తుందని గాంధీ పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధికి ఇది నమూనాగా మారుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా మురికి కూపంలా మారిన చెరువును శాశ్వత పరిష్కార దిశగా అభివృద్ధి చేస్తున్నామని, పునర్జీవనం అనంతరం ఈ చెరువు స్వచ్ఛమైన నీటితో అందమైన ప్రకృతి వనంలా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చెరువు కట్ట చుట్టూ చెట్లు నాటడం ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు. CSR నిధులతో చెరువు అభివృద్ధికి ముందుకొచ్చిన Nexus Select Malls సంస్థ, మల్లిగవాడ్ ఫౌండేషన్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితం కోసం సంస్థలు ముందుకు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట బలోపేతం, అలుగు మరమ్మత్తులు, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, ప్రత్యేక UGD పైప్‌లైన్ ఏర్పాటు వంటి పనులు చేపడతామని తెలిపారు.
మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మళ్లింపు ప్రక్రియ ద్వారా స్వచ్ఛమైన నీరు మాత్రమే చెరువులోకి వచ్చేలా వ్యవస్థ రూపొందిస్తున్నామని చెప్పారు. అధికారులు నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని, ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు. చెరువు ఔట్‌లెట్ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల సంరక్షణలో కాలనీ వాసులు, ప్రజలు సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలని గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ AE గులాం, CMC DE శ్రీదేవి, AE ప్రతాప్, CSR ప్రతినిధులు, స్థానిక నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సుదేశ్ తదితరులు పాల్గొన్నారు.





