శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ బ్లూమ్ హైస్కూల్ సఫారీ నగర్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పూలపల్లి వెంకటరమణ (విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్) విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ వారు జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవముగా 2011వ సంవత్సరము నుండి ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఓటింగ్ వంటిది ఏదీ లేదు – నేను కచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలలో అవగాహన కార్యక్రమాలలో భాగంగా వక్తృత్వ, వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు అలాగే ర్యాలీలు నిర్వహిస్తుంటారని అన్నారు. జనవరి 1వ తేదీన, ఏప్రిల్ 1వ తేదీన, జూలై 1న, అక్టోబరు 1వ తేదీల నాటికి 18 సంవత్సరముల వయసు నిండిన ప్రతి ఒక్క భారతీయ యువతీ, యువకులకు ఓటును నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు.ఈ సందర్భంగా అందరిచేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పిల్లలచేత వీధులలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి V.ఫణికుమార్, సభ్యుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
