శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌తో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే నిర్బంధ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇటువంటి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ నిరసన చేపట్టారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రజల త్యాగాలను అవమానించేలా ఉన్నాయంటూ తేజస్వి వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ సందర్బంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు ఆగ్రహంతో తేజస్వి సూర్య దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పొట్ట నరేందర్ యాదవ్ మాట్లాడుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతా రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణ గౌడ్, హరీష్ రావు, శ్రీకాంత్, కృష్ణ, శ్రీనివాస్, ముజ్జు భాయ్, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






