ఇందిరా నగర్‌లో ఘ‌నంగా మారియమ్మన్ మావువిలక్ తిరువిలా వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్‌లో దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల వార్షిక మారియమ్మన్ మావువిలక్ తిరువిలా ఉత్సవాల‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా ఇందిరా నగర్‌లో నివసిస్తున్న తమిళ ప్రజలు తమ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజారుల ఆధ్వర్యంలో దుర్గమ్మ, పోచమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నారికేళ నైవేద్యాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దుర్గామాత, పోచమ్మ దేవతల ఆశీస్సులతో ఇందిరా నగర్ బస్తీ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాల‌న్నారు. అమ్మవారి కటాక్షం ప్రతి కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నామ‌ని అన్నారు. ఉత్సవ నిర్వాహకుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ పండుగ విశేషాలను వివరించారు. తమిళనాడులో ప్రత్యేకంగా జరుపుకునే మారియమ్మన్ మావువిలక్ తిరువిలా, తెలంగాణలో జరుపుకునే బోనాల పండుగలతో సమానమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిందని తెలిపారు. మారియమ్మన్ అంటే గ్రామదేవత (పోచమ్మ) అని, మావువిలక్ అంటే పిండితో తయారు చేసే దీపం, తిరువిలా అంటే ఉత్సవం అని అర్థమని వివరించారు.

ప్రతి సంవత్సరం ఫాల్గుణం లేదా చైత్రమాసంలో ఈ ఉత్సవాల‌ను నిర్వహిస్తార‌ని చెప్పారు. ఈ పండుగలో ముఖ్యంగా మహిళలు భక్తిశ్రద్ధలతో తయారు చేసే పిండిదీపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ‌ని, ఇవే అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తార‌ని తెలిపారు. అదేవిధంగా చైత్రమాసంలో ఉండే ఎండల తీవ్రత నుంచి రక్షణ కలగాలని కోరుతూ కొంతమంది భక్తులు రాగి పిండితో తయారు చేసిన రాగిజావను నైవేద్యంగా సమర్పించడం ఈ ఉత్సవానికి ప్రత్యేకతగా నిలుస్తుంద‌న్నారు. ఉత్సవ ముఖ్య నిర్వాహకుడు మురుగానందన్ మాట్లాడుతూ ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రథమ పూజారి వెంకటేష్, ముఖ్య నిర్వాహకులు మురుగానందన్, భరత్, రాజ్‌కుమార్, కృష్ణమూర్తి, గోపి, చిన్నా, యాదగిరి, సాయి కుమార్, సిద్ధార్థ, శివప్రసాద్, రాము, విజయ్, సూర్య, నవీన్, చరణ్, ఉమాకాంత్, విజయ్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here