చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): కిరాణా సరుకులను కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా తెగ్లుర్ మండలం కేతరకుంట గ్రామానికి చెందిన దంపతులు సంజయ్ బోని (50), బోని మత్తుర బాయి నవంబర్ 5వ తేదీన లింగంపల్లిలోని ఎల్వీ రెడ్డి కాలనీలో నివాసం ఉండే తమ కుమారుడి ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి వారు అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా నవంబర్ 6వ తేదీన ఉదయం 11.30 గంటల సమయంలో కిరాణా సరుకులు కొనేందుకు సంజయ్ బోని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతని కోసం చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద విచారించారు. అయినప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.