బీసీల సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి: బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ కోరారు. బీసీల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టింగ్ అభ్యర్థి మారబోయిన రవికుమార్ యాదవ్‌కు అందజేశారు. మియాపూర్‌లోని మదీనాగూడ భూమి బాంకెట్ హాల్‌లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగుండ్ల ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా సమావేశంలో ఈ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ దేశ జనాభాలో అధిక శాతం ఉన్న 132 బీసీ కులాలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేద బీసీ కుటుంబాలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు కేంద్రం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ముద్ర రుణాలు, సబ్సిడీ రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు అన్ని బీసీ కులాలకు సమానంగా అందించాలని కోరారు. రైతుల్లో అధిక శాతం బీసీలే ఉన్నందున వారికి బ్యాంకు రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందించడంతోపాటు రైతు ఆత్మహత్యలను అరికట్టే చర్యలు చేపట్టాలని సూచించారు. సంచార జాతులకు చెందిన బీసీ కులాలను గుర్తించి సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావాలని, గ్రామీణ పేదరిక నిర్మూలనకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొంటు ముకుందం, రాజు, సాయిలు, హరికృష్ణ చారి, కోటగిరి మారుతి, కృష్ణమోహన్, కొంటు సుమన్, ఆంజనేయులు, రామకృష్ణ గౌడ్, బి. కృష్ణ, ముత్యం, రాఘవేందర్‌తోపాటు వివిధ బీసీ కుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here