శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత మెగా మెడికల్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను గురువారం మియాపూర్‌లోని లక్ష్మీనగర్ నాగసాయి బాబా దేవాలయం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో బ్లడ్ ప్రెషర్, రాండమ్ బ్లడ్ షుగర్, హార్ట్ రేట్, బీఎంఐ, బాడీ ఫ్యాట్, మసిల్ మాస్, బోన్ మాస్, మెటబాలిక్ ఏజ్, బాడీ వాటర్, విసెరల్ ఫ్యాట్ తదితర ఆరోగ్య పరీక్షలతోపాటు కంటి, దంత వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. పరీక్షల అనంతరం వైద్యులు ప్రజలకు అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు.

క్యాంప్ నిర్వహణకు విజయ డయాగ్నస్టిక్ సెంటర్, సెంటర్ ఫర్ సైట్, క్లోవ్ డెంటల్ సంస్థలు సహకారం అందించాయి. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం, శ్రీరాములు, పారునంది నాగులు, దయాకర్, శ్రీరామ్, కరుణాకర్, ఆర్‌పీ టీమ్ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు, కాలనీ పెద్దలు, యువత, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





