శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభను ఆగస్టు 2న మొయినాబాద్ మండల కేంద్రంలో అంజనీ దేవి గార్డెన్లో నిర్వహించనున్నామని, ఈ మహాసభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం సిపిఐ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని పలువురు పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 డిసెంబర్ 26 నాటికి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ పార్టీగా సిపిఐ ఖ్యాతి పొందిందని అన్నారు. స్వాతంత్రం కొరకు జరిగిన పోరాటంలో ఆనాడే అనేకమంది ఉరి కంబాలు ఎక్కి ప్రాణ త్యాగాలు చేసిన వీర చరిత్ర గలది భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కొరకై ఎన్నో ఉద్యమాలు చేసి 20 బస్తీలను నెలకొల్పిన చరిత్ర సిపిఐకి దక్కిందన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి సిపిఐ ఆధ్వర్యంలో మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి కే చంద్ర యాదవ్, కృష్ణ నాయక్, బాలు, రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.






