శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. వివేకానంద నగర్లోని తన నివాసంలో 6,500 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి భక్తులకు ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, చెరువులు కలుషితం కాకుండా చూడడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలని సూచించారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది 6,500 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యుడు బసిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సింగదాసరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






