22ఏలో తప్పుగా చేర్చిన భూములను వెంటనే తొలగించాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భూ భారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందాకు తెరలేపిందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. 22ఏ నిషేధిత జాబితాలో తప్పుగా చేర్చిన భూములను వెంటనే తొలగించి, బాధిత భూ యజమానులకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, సీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన నిరసన దీక్షలో రవికుమార్ యాదవ్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దాదాపు లక్ష ఆస్తులు, 16 లక్షల ఎకరాలకు పైగా రిజిస్టర్డ్ భూములను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా భూములను 22ఏలో చేర్చడానికి బాధ్యులెవరో వెల్లడించాలని కోరారు. 22ఏలో ఎన్ని ఎకరాల భూములను చేర్చారు, ఎంతమంది భూ యజమానులు బాధితులుగా ఉన్నారనే పూర్తి వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.

అధికారుల తప్పిదాలను వెంటనే సరిదిద్దుతామని మంత్రి ప్రకటించినప్పటికీ, ఒక్కో భూ బాధితుడు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. భూమిని 22ఏలో చేర్చడం సులభంగా జరుగుతుంటే.. దాన్ని తొలగించడానికి నెలల సమయం ఎందుకు పడుతోందని ప్రశ్నించారు. చట్టబద్ధమైన పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్న భూములపై ఆంక్షలు ఎందుకు విధించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తప్పుగా భూములను 22ఏలో చేర్చిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ, అధికారుల తప్పిదాలకు భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.

ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ పట్టా భూములను కూడా 22ఏలో చేర్చారా? లేక అధికారులు కుమ్మక్కై 30 శాతం కమిషన్ కోసం ఈ వ్యవహారానికి పాల్పడ్డారా అనే విషయాన్ని ప్రభుత్వం తేల్చాలని రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కమిషన్ వ్యవహారం వెనుక ఉన్న అధికారులు, మధ్యవర్తులు, రాజకీయ పెద్దలు ఎవరో బయటకు తీసుకురావాలని, ప్రతి బాధితుడి భూ రికార్డులను పరిశీలించి న్యాయం జరిగేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. 22ఏలో తప్పుగా చేర్చిన భూములను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. 30 శాతం కమిషన్ ఆరోపణలపై సీబీఐ, విజిలెన్స్, ఏసీబీ అధికారులు సుమోటోగా విచారణ చేపట్టి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, బాధిత భూ యజమానులకు వెంటనే న్యాయం చేయాలని రవికుమార్ యాదవ్ కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి బీజేపీ నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here