శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్–పటాన్‌చెరువు ముంబై జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జ్యోతి నగర్–అశోక్ నగర్ సమీపంలో తొలగించిన బస్‌స్టాప్‌ను వెంటనే పునరుద్ధరించాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. బస్‌స్టాప్ తొలగించడంతో చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాస్ నగర్, రెడ్డి కాలనీ, భవానీపురం, శంకర్ నగర్, రాజేంద్ర రెడ్డి నగర్, పద్మజా కాలనీలతో పాటు ఆర్‌సీ పురం డివిజన్‌లోని జ్యోతి నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలు, ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిత్యం రాకపోకలు సాగించే విద్యార్థులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్‌స్టాప్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మించాలని కోరినట్లు వెల్లడించారు.
ఈ సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారని రఘునాథ్ రెడ్డి తెలిపారు. సమస్యను వెంటనే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసి, బస్‌స్టాప్ పునరుద్ధరణతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.





