శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలు, తాజా పరిజ్ఞానంపై చర్చించేందుకు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్స్ (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు. వీరిలో సుమారు 12 మంది అంతర్జాతీయ స్పీకర్లు, 50 మందికి పైగా జాతీయ స్థాయి నిపుణులు ఉన్నారు. వారు తమ అనుభవాలను, ఇంప్లాంటాలజీ రంగంలో వస్తున్న ఆధునిక పరిజ్ఞానాన్ని డెలిగేట్లతో పంచుకుంటున్నారు.

సెప్టెంబర్ 3న ప్రీ-కాన్ఫరెన్స్ కార్యక్రమాలతో పాటు పలు హ్యాండ్స్-ఆన్ కోర్సులను నిర్వహించారు. ఇంప్లాంటాలజీలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నిక్స్‌ను డెంటిస్టులు, విద్యార్థులు ప్రాక్టికల్‌గా నేర్చుకునేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సెప్టెంబర్ 4 నుంచి ప్రధాన సైంటిఫిక్ సెషన్స్ కొనసాగుతున్నాయి. ప్రీ-కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించగా, ప్రధాన కాన్ఫరెన్స్‌ను తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ISOI నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ శరద్ శెట్టి మాట్లాడుతూ.. ఇంప్లాంట్ చికిత్సపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న టెక్నాలజీ, ఆధునిక చికిత్సా విధానాలపై డెంటల్ ప్రొఫెషనల్స్ ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సదస్సు ద్వారా దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా డెంటిస్టులు, విద్యార్థులు, నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి తమ జ్ఞానం, అనుభవాలను పంచుకుంటున్నారని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించడం గర్వకారణమన్నారు.
ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ విజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇంతకాలం తర్వాత ISOI జాతీయ సదస్సు జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా డెంటిస్టులతో పాటు అంతర్జాతీయ నిపుణులు పాల్గొనడంతో నగరం వేదికగా అద్భుతమైన శాస్త్రీయ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇంప్లాంటాలజీలో వస్తున్న ఆధునిక మార్పులు, కొత్త టెక్నిక్స్‌ను తెలుసుకునేందుకు విద్యార్థులు, యువ డెంటిస్టులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పద్మరాయలు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువ డెంటిస్టులకు ముఖ్యంగా ఇంప్లాంట్ ఎడ్యుకేషన్‌లో కొత్త విషయాలను అందించడమే సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రీ-కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన హ్యాండ్స్-ఆన్ కోర్సుల ద్వారా ఆధునిక టెక్నిక్స్‌ను ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం కల్పించామని తెలిపారు. నాలుగు రోజుల సదస్సులో పొందిన జ్ఞానం భవిష్యత్ క్లినికల్ ప్రాక్టీస్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ISOI 32వ జాతీయ సదస్సు అధికార ప్రతినిధి డాక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ.. 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించడం గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా డెలిగేట్లతో పాటు అంతర్జాతీయ స్పీకర్లు పాల్గొనడం సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. హైదరాబాద్‌లోని డెంటిస్టులు, డెంటల్ కాలేజీల విద్యార్థులకు అంతర్జాతీయ నిపుణులను ప్రత్యక్షంగా కలుసుకుని కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభించిందని తెలిపారు. ఇంప్లాంటాలజీ రంగంలో తాజా సాంకేతికతలు, ఆధునిక చికిత్సా విధానాలు, క్లినికల్ అనుభవాలపై సదస్సులో నిపుణులు విస్తృతంగా చర్చిస్తున్నారు. హ్యాండ్స్-ఆన్ శిక్షణ, సైంటిఫిక్ సెషన్స్ ద్వారా డెంటిస్టులు, విద్యార్థులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించడమే సదస్సు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.





