కుత్బుల్లాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మంత్రి మల్లారెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. తన భూమిలో కొంత భాగాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని చెబుతూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారం గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళకు 2 ఎకరాల 13 కుంటల భూమి ఉంది. అందులో 20 కుంటల స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించి ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. మల్లారెడ్డికి అమ్ముడుపోయిన తన లాయర్ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని ఆమె తెలిపింది. తనను బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను ఫిర్యాదులో కోరింది. కాగా మంత్రి మల్లారెడ్డితోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.