యాదవ విద్యార్థుల హాస్టల్ భవనాన్ని వెంటనే ప్రారంభించాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కోకాపేట్‌లో యాదవ విద్యార్థుల కోసం నిర్మించిన వసతి గృహ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లిలోని బీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోకాపేట్‌లో యాదవ విద్యార్థుల వసతి గృహం కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించి, అప్పటి ప్రభుత్వం రూ.5 కోట్ల వ్యయంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసిందని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత భవనాన్ని ప్రారంభించే విషయంలో ఎలాంటి చొరవ కనిపించడం లేదని విమర్శించారు.

2018లో అప్పటి ప్రభుత్వం బీసీ కులాలతోపాటు ఇతర కుల సంఘాలకు కూడా ఉప్పల్ భగాయత్, కోకాపేట్ ప్రాంతాల్లో భూములు కేటాయించిందని గుర్తు చేశారు. కమ్మ కులానికి 10 ఎకరాలు, వెలమ కులానికి 5 ఎకరాలు, ముదిరాజ్, యాదవ్ తదితర కుల సంఘాలకు చెరో 5 ఎకరాల చొప్పున భూములు ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే యాదవ విద్యార్థుల వసతి గృహం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని కోకాపేట్ యాదవ విద్యార్థుల హాస్టల్ భవనాన్ని ప్రారంభించాలని కోరారు. అలాగే యాదవ సంఘాల నాయకులు ఐక్యంగా ముందుకు వచ్చి ముఖ్యమంత్రిని ఆహ్వానించి భవన ప్రారంభోత్సవం నిర్వహించాలని సూచించారు. హాస్టల్ ప్రారంభమైన తర్వాత మిగిలిన మౌలిక వసతులు, ఇతర నిర్మాణాల కోసం ప్రభుత్వాన్ని నిధులు కోరాలని ఆయన అన్నారు. కుల సంఘాల భవనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడంలో ఎంతో ఉపయోగపడుతుందని బేరి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here