శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి ఆనంద దేవస్థానం ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ రోలింగ్ హిల్స్‌లో జగన్నాథ రథయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొని రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్నాథ స్వామి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. జగన్నాథ రథయాత్ర భారతీయ ధర్మం, సమానత్వం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రథయాత్రలో భక్తులంతా కలిసి పాల్గొనడం ద్వారా అందరం ఒక్కటే అనే భావన బలపడుతుందని అన్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అయోధ్య రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ ఆలయ ఆధునీకరణ, నదుల సుందరీకరణ వంటి అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. దేశ యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను తెలుసుకుని ధర్మ పరిరక్షణతోపాటు సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పండుగలు, ఆధ్యాత్మిక యాత్రలు సమాజాన్ని ఏకం చేసే శక్తిగా మారాలని ఆకాంక్షించారు. జగన్నాథ స్వామి కృపతో ప్రతి ఒక్కరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, దేవస్థాన ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





