శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా జగద్గిరిగుట్టలోని సంస్కృతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డమీది బాలరాజు ఎంపికయ్యారు. శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజల్ అహ్మద్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కడం తనకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సామాన్య ప్రజలు అధికంగా నివసించే ప్రాంతంలో తక్కువ ఫీజులతో ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్ విద్య అందని ద్రాక్షగా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆర్థిక స్థోమతకు అనుగుణంగా తమ పాఠశాలలో ఫీజులను నిర్ణయించినట్లు చెప్పారు. విద్యారంగంలో చేస్తున్న సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించడం ఆనందంగా ఉందన్నారు.
భవిష్యత్తులో పేద, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని బాలరాజు స్పష్టం చేశారు. తనకు జిల్లా స్థాయి పురస్కారం దక్కడానికి చొరవ చూపిన జిల్లా ట్రస్మా, కుత్బుల్లాపూర్ ట్రపసా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.





