శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మురళీధర్ సొసైటీ కాలనీలో బచ్చుకుంట చెరువు అలుగు నుంచి జాతీయ రహదారి (NH-65) వరకు రూ.1.92 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, బచ్చుకుంట చెరువు అలుగు నుంచి మురళీధర్ సొసైటీ కాలనీలో ఉన్న వరద నీటి కాలువ ఔట్లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.1.92 కోట్లతో కాలువ నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

బచ్చుకుంట చెరువు ఔట్లెట్ సరిగా లేకపోవడంతో వరద నీరు కాలనీలోకి చేరి ప్రతి వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తుతోందని, దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చెరువు ఔట్లెట్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ ప్రణాళికతో వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలువ నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు తనవంతు కృషి కొనసాగుతుందని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని, హఫీజ్‌పేట్ డివిజన్‌తో పాటు మొత్తం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని ఆరెకపూడి గాంధీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.





