చందానగర్‌లో ఘనంగా PJR కాంస్య విగ్రహావిష్కరణ

శేరిలింగంప‌ల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నాయకుడు, ప్రజానేత పి. జనార్ధన్ రెడ్డి (PJR) కాంస్య విగ్రహాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీజేఆర్ కుమార్తె, మాజీ కార్పొరేటర్ విజయ రెడ్డి, యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేశ్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, పీజేఆర్ అభిమాన కమిటీ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పీజేఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. కార్మిక హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా, పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ప్రజానాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. 2007 డిసెంబర్ 28న పార్టీ సమావేశానికి వెళ్తూ గుండెపోటుతో పీజేఆర్ మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటుగా మిగిలిందన్నారు. ఆయన స్మారకార్థం ఖైరతాబాద్ చౌరస్తాలో కాంస్య విగ్రహం, జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద విగ్రహం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అలాగే గచ్చిబౌలి ఫ్లైఓవర్‌కు పీజేఆర్ ఫ్లైఓవర్ గా నామకరణం చేయడం, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఆయనకు అందిస్తున్న ఘన నివాళులని పేర్కొన్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన పీజేఆర్ ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని గాంధీ అన్నారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి, పేదలకు గూడు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కోసం నిరంతరం కృషి చేసిన జనహృదయ నేతగా పీజేఆర్ నిలిచిపోయారని కొనియాడారు. పీజేఆర్ స్టేడియానికి కొత్త అందం వచ్చిందని, భవిష్యత్తులో అన్ని హంగులు, సకల సౌకర్యాలతో స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పీజేఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here