విద్యా హక్కు చట్టం అమలు చేయండి: డాక్టర్ చంటి ముదిరాజ్

శేరిలింగంపల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకొని, అధిక ఫీజుల వసూళ్లను నియంత్రిచాలని, విద్యా హక్కు చట్టం తక్షణమే అమలు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులతోపాటు డొనేషన్లు, వార్షిక ఫీజులు, స్కూల్ డ్రెస్‌లు, పుస్తకాలు వంటివి బలవంతంగా అంటగట్టి దోపిడీకి గురిచేస్తున్నారని తెలిపారు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించలేకపోతే స్కూళ్ల నుంచి వెళ్లగొట్టడం, హాల్ టికెట్లు, టీసీలు ఇవ్వక పోవడం వంటి దుర్మార్గపు చర్యల కు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టం అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ న‌టుడు కిరణ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ దిలీప్ రావ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపీనాథ్ కట్టెకోల, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రవీణ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here