శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ మక్తా మహబూబ్ పేటలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా సర్వే నంబర్ 44లో ఎలాంటి అనుమతులు లేకుండా 5 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారని, ఈ విషయంపై తాము ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు. సదరు భవనాల్లో మూడింటిని సీఎంసీ అధికారులు సీజ్ చేశారని, ఈ చర్యను అభినందిస్తున్నామని, కానీ ఇంకా అలాంటి 13 భవంతులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 2016లో ఇదే విషయంపై ఆర్డర్ ఉందని, ఆక్రమణదారులు ఎలాంటి అనుమతులు లేకుండా 5, 6 అంతస్తుల నిర్మాణాలను 100 గజాల్లో నిర్మిస్తున్నారని, కొన్ని చోట్ల 7 అంతస్తులను సైతం నిర్మిస్తున్నారని, నాణ్యత లేకుండా భవంతులను నిర్మిస్తూ తక్కువ ధరలకు విక్రయించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని, సదరు భవంతులను సీజ్ చేయాలని తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి కోరారు.






