శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పరిధిలోని అంజయ్యనగర్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడాలని కోరుతూ జనం కోసం సంస్థ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సర్వే నంబర్లు 134, 136లో ఉన్న 1 ఎకరం 20 గుంటల పార్కు స్థలాన్ని రక్షించాల్సిందిగా సర్కిల్-20 అధికారులు ఇప్పటికే 2025 నవంబర్ 25న హైడ్రాకు లేఖ రాసినప్పటికీ, అదే స్థలంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేసి పార్కు స్థలాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాదాపూర్ డీసీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఇదే అంశంపై డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణకు పలుమార్లు ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ సానుకూలంగా స్పందించి, అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జనం కోసం సంస్థ వెల్లడించింది.





