హైడ్రా అరాచకాలను తరిమికొట్టాలి, దేవాలయాల జోలికొస్తే సహించేది లేదు: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ సున్నం చెరువులోని హనుమాన్ ఆలయాన్ని తొలగించేందుకు హైడ్రా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నార‌ని నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ స్వామి వారిని దర్శించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు వద్ద ఉన్న పురాతన హనుమాన్ దేవాలయాన్ని హైడ్రా అధికారులు తొల‌గించాలని చూస్తున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలో బీజేపి ఆధ్వర్యంలో వి.హెచ్.పి, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని అడ్డుకున్నామ‌ని ర‌వికుమార్ యాద‌వ్ తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఈ హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నార‌ని, హైడ్రా అధికారులు తొలిగించాలని చూడటం స‌మంజ‌సం కాద‌ని అన్నారు. పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం చేస్తున్న హైడ్రా అధికారుల తీరు సరైనది కాదని, నిన్న మొన్నటి వరకు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, ఇప్పుడు హిందూ దేవాలయాల జోలికి వస్తున్నారని మండి పడ్డారు.

పైన దేవుడు, ఇక్కడి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కొన్ని నెలల క్రితం నానక్ రామ్ గూడలోని కాళి మాత అమ్మవారి ఆలయాన్ని ఇలాగే తొలగించాలని నోటీసులు ఇస్తే అడ్డుకున్నామ‌ని, ఇప్పుడు సున్నం చెరువు హనుమాన్ టెంపుల్ జోలికి వచ్చారని, రోడ్ మధ్యలో ఉన్న దర్గా జోలికి వెళ్ళే దమ్ము లేని ప్ర‌భుత్వానికి హిందువులు ఎంతో పవిత్రంగా పూజలు చేసే దేవుళ్ళు అంటే చులకనా అని అన్నారు. హిందూ దేవాలయాల జోలికి వస్తే సహించేది లేదని ప్రతి దగ్గర అడ్డుకుని తీరుతామని అన్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మహేందర్ యాదవ్, శివ కుమార్ యాదవ్, లింగస్వామి, నరేష్, రాము యాదవ్, సుమన్, శీను నాయక్, స్రవంతి, భ‌జరంగ్ దల్, విశ్వహిందూ పరిషత్ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here