ఎస్‌ఐఆర్‌-2026పై ఈసీఐ కీలక ఆదేశాలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శి నవీన్ కుమార్ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌-2026) ప్రక్రియపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి అమిత్ నారాయణ్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల విధులు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని వివరించారు.

ఓటర్లకు చేరాల్సిన నోటీసుల పంపిణీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వంద శాతం పంపిణీ పూర్తి చేయాలని నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ లేని కేసులు, తార్కిక వ్యత్యాసాలు ఉన్న కేసులపై విచారణను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటినీ సందర్శించి అవసరమైన పత్రాలను సేకరించాలని, సేకరించిన పత్రాలను ఎలాంటి ఆలస్యం లేకుండా ఈసీఐ నెట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పేదలు, నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను మరింత బలోపేతం చేసి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, రంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సంగారెడ్డి అదనపు కలెక్టర్, పటాన్‌చెరు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here