గోపి చెరువు వద్ద స్వచ్ఛతా హీ సేవా.. CRPF, CMCతో కలిసి శ్రమదానం చేసిన PAC చైర్మన్ గాంధీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువు ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రమదానం నిర్వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సదరన్ సెక్టార్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) శేరిలింగంపల్లి జోన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, CRPF ఇన్‌స్పెక్టర్ జనరల్ తుమ్మల విక్రమ్, CRPF సిబ్బంది, CMC అధికారులు, కాలనీ వాసులతో కలిసి ఆయన శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా–2026 ప్రచారంలో భాగంగా CRPF సదరన్ సెక్టార్ ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పరిశుభ్రత, పౌర బాధ్యత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.

స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతోందని తెలిపారు. స్వచ్ఛత మే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రజలను స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026పై అవగాహన కల్పించడం, శ్రమదానం, స్వచ్ఛతా ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణతో పాటు పాఠశాలలు, ప్రజా ప్రదేశాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం ఈ ప్రచారంలో భాగమని గాంధీ వివరించారు. గోపి చెరువు వద్ద నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో CRPF సిబ్బందితో పాటు డోయెన్స్ టౌన్‌షిప్ నివాసితులు, CMC సిబ్బంది పాల్గొన్నారు. చెరువు గట్టున మొక్కలు నాటారు. గోపి చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెరువులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని గాంధీ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చెరువులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో జన్ భాగీదారి కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ స్వచ్ఛతా కార్యక్రమాలకు మద్దతుగా CRPF చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో CRPF ఇన్‌స్పెక్టర్ జనరల్ తుమ్మల విక్రమ్, DIGలు ప్రవీణ్ ఘాగ్, డాక్టర్ సంజయ్ కుమార్, పంకజ్ కుమార్, CMC అధికారులు, DE ఆనంద్, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, లింగా రెడ్డి, గఫుర్, వార్డు మెంబర్ రాము, శ్రీకాంత్ దేవులపల్లి, నరసింహ రెడ్డి, నరసింహ, మహేందర్ సింగ్, మహేష్ చారీ, పవన్, సాయి, డోయన్స్ టౌన్‌షిప్ కార్యదర్శి కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు షాజీ మాథ్యూ, సలహాదారు లింగారెడ్డితో పాటు స్థానిక నాయకులు, నివాసితులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here