గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): కోవిడ్ నేపథ్యంలో ముందు వరుసలో నిలిచి ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యం కోసం, వారిలో శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గాను హార్‌స్కో ఎన్విరాన్‌మెంటల్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆ సంస్థ శుక్రవారం 6వేల కేజీల డాబర్ చ్యవన్‌ప్రాశ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ వీసీ సజ్జనార్‌కు అందజేసింది. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న పోలీసులకు మద్దతుగా, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద హార్‌స్కో ఎన్విరాన్‌మెంటల్ డాబర్ చ్యవన్‌ప్రాశ్ లను అందించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ లావణ్య, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ప్రధాన కార్యదర్శి కృష్ణ యేదుల, హార్‌స్కో ఎన్విరాన్‌మెంటల్ ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రెసిడెంట్ శివకుమార్ సుబ్రమణియం, హెచ్ఆర్ హెడ్ వాణి తదితరులు పాల్గొన్నారు.