ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

శేరిలింగంప‌ల్లి, మే 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ కాలనీలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజా సేవలో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.

రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం, మహిళా సాధికారత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం, పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు వంటి అనేక సంస్కరణలు ఆయన పాలనలోనే జరిగాయని అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గాంధీ అభినందించారు. తలసేమియా చిన్నారులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్తం ఎంతో ఉపయో గపడుతుందని తెలిపారు. అన్ని దానాల్లో రక్తదానం గొప్పద‌ని పేర్కొంటూ యువత పెద్దఎత్తున రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రక్తదానం చేసిన దాతలను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రశంసాపత్రాలు, పురస్కారాలను అందజేశారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానమని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్య‌క‌ర్త‌లు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here