శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ విజయ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు, శ్రీ విజయ గణపతి స్వామివారి కృప ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. నూతనంగా నిర్మించిన ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచి, పరిసర ప్రాంత ప్రజలకు ప్రశాంతత, భక్తి భావాన్ని అందించాలని కోరుకున్నారు. దేవాలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. హిందూ ధర్మం, ఆధ్యాత్మిక విలువలు, సనాతన సంప్రదాయాలను పరిరక్షించి, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
అనంతరం ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు గంగాధర్ రెడ్డిని ఘనంగా సత్కరించి, మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ నాయక్, సీనియర్ నాయకులు విఠల్, వేణు, వెంకటేష్, మహేష్, విజయ్, కృష్ణ, శ్రీశైలం, నాగేష్, ధర్మ, వెంకన్న, నాగరాజు, సిద్దు, సాయి తదితరులతో పాటు కాలనీ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు. తాజ్ నగర్, ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.





