వైశాలినగర్‌లో అహింసా స్తూపం ఆవిష్కరణ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని వైశాలినగర్ కాలనీలో మంజీర పైప్‌లైన్ రోడ్డు నుంచి రైల్వే అండర్‌పాస్‌కు వెళ్లే మార్గంలో జైన్ సంఘం తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అహింసా స్తూపాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌ల‌తో కలిసి PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వైశాలినగర్ కాలనీలో అహింసా స్తూపాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. జైనమతంలో అహింసకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని, అరచేతిపై చక్రం ఉన్న చేయి అహింసకు ప్రతీకగా నిలుస్తుందని వివరించారు.

పైకెత్తిన చేయి ఆపు అనే సందేశాన్ని ఇస్తుందని, ఏ పని చేసే ముందైనా ఒక్క క్షణం ఆగి.. ఆ పని వల్ల ఇతరులకు ఏమైనా హాని కలుగుతుందా అని ఆలోచించాలని ఈ చిహ్నం గుర్తుచేస్తుందని గాంధీ పేర్కొన్నారు. అరచేతిలోని చక్రం సంసార చక్రాన్ని, పునర్జన్మల పరంపరను సూచిస్తుందని, అహింసను కఠినంగా పాటించడం ద్వారా సంసార చక్రాన్ని నిలిపివేయవచ్చనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అహింసను అలవర్చుకోవడంతో పాటు సత్ప్రవర్తన కలిగి ఉండాలని గాంధీ సూచించారు. శాంతి మార్గమే శ్రీరామ రక్ష అని పేర్కొంటూ సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైన్ సంఘం సభ్యులు శిల్ప జైన్, సందర్బు జైన్, నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ధాత్రి గౌడ్, అక్తర్, శాస్త్రితో పాటు వైశాలినగర్, సరోవర్ కాలనీ, శారదనగర్ కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here