శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): బాలికలను రక్షిద్దాం, చదివిద్దాం, అమ్మాయిలుగా ఉండనిద్దాం, వధువుగా కాదు అని ఐసీడీఎస్ శేరిలింగంపల్లి ప్రాజెక్టు ఆదిత్యనగర్ సెక్టార్ సూపర్ వైజర్ ఠాకూర్ కోమలాబాయి అన్నారు. మార్తాండనగర్ అంగన్ వాడీ కేంద్రం 2 లో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలికలకు, 21 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలురకు వివాహం చేయడం, అందుకు సహకరించిన వారందరూ బాధ్యులేనని అన్నారు. అందుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధిస్తారని అన్నారు. ఆవు, గేదె, మేకలకు ఆడపిల్ల పుడితే సంబరాలు చేసుకుంటాం కానీ మనకు ఆడపిల్ల పుడితే బాధపడతాం అని, ఇంకా ఎన్నాళ్లు ఇలా ప్రవర్తిస్తారని, ఇప్పటికైనా మారుదామని అన్నారు. ఆడపిల్లలను కాపాడుదామని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్, ప్రాజెక్టు స్థాయిలో సీడీపీవో, మండల స్థాయిలో తహసీల్దార్, సెక్టార్ స్థాయిలో ఐసీడీఎస్ సూపర్ వైజర్, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా అంగన్ వాడీ టీచర్ బాల్య వివాహ నిరోధక అధికారులుగా పనిచేస్తారని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి ప్లకార్డులు పట్టుకుని క్యాలనీలలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రూప, రాజీ, గీత, దుర్గం, ఆస్మా బేగం, ఎంపీహెచ్వో సునంద, అంగన్ వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, కాలనీవాసులు తిరుపతి, రజనీకాంత్, వేణు, కిశోర్, బాలికలు, తల్లులు పాల్గొన్నారు.






