నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో తరచుగా రక్తదానం చేసే దాతలను ఘనంగా సన్మానించారు. చందానగర్ లో గల సూపర్ విజ్ జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న సిటిజన్ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు గాయం సంగీత రెడ్డి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసేసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యదవ్‌లు 120 సార్లు రక్తదానం చేసిన భెల్ మాజీ వైద్యులు రాకేష్ ధీర్‌తో పాటు 30 నుంచి 50 సార్లు రక్తదానం చేసిన 10 మంది దాతలను సత్కరించి జ్ఙాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం వలన దాతలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాన్ని కాపాడటం వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. రక్తదానం చేయడం వలన శరీరంలో ఐరన్ శాతం క్రమబద్దం చేయబడుతుందని, తద్వారా గుండెపోటు నుండి దూరంగా ఉంచుతుందన్నారు. కొలెస్ట్రాల్ తగ్గి కాన్సర్ వ్యాధి రాకుండా ఉండటానికి, కొత్తకణాల ఉత్పత్తి దోహదపడుతుందన్నారు. తద్వారా బిపి అదుపులో ఉంటుందని, క్యాలరీలు, కొవ్వు పదార్థాలు కరిగి శారీరక దృడత్వం లభిస్తుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు, యాబై కేజీలు బరువు కలిగి ఉన్న ఆరోగ్య వంతులు మగవారు సంవత్సరానికి నాలుగు సార్లు, మహిళలు సంవత్సరానికి రెండు లేక మూడు సార్లు రక్తదానం చేయవచ్చునని తెలిపారు. రక్తదానానికి ముందు నీళ్ళు ఎక్కువగా త్రాగాలనీ, ఆరోగ్యకరమైన ఆహారాని తీసుకోవాలని తెలిపారు.
సమాజంలో డిమాండ్‌కు తగ్గ రక్తం నిల్వలు లేని కారణంగా ఏర్పడుతున్న అనేక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు సమాజంలో రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి రక్తదానం చేయడానికి వారిలో స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు. 2004 జూన్ 14 నుండి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వివరించారు. జీవశాస్త్రవేత్త, వైద్యులు, రోగనిరోధక శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్ జన్మదినం. ఆయన రక్తాన్ని 4 గ్రూపులు గా విభజించారని, 1909లో పోలియో వైరస్‌ను కనిపెట్టారని తెలిపారు. 1930లో ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిందనీ, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కార్ల్ లాండ్ స్టీనర్ జన్మదినాన్ని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా (14 జూన్ ) ప్రపంచ ఆరోగ్య సంస్థవారు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా రక్తం మాత్రం మానవ శరీరంలోనే తయారవుతుందిని అన్నారు. కావున ప్రస్తుతం కోవిడ్ 19 విపత్కర పరిస్థితులను ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని యువత స్వచ్చంద రక్తదాన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తూనిక రాఘవేంద్రరావు , రామ్మోహనరావు, పాలం శ్రీను, జనార్దన్, మల్లేష్, విష్ణుప్రసాద్, మూర్తి, ఖాదర్ మొయినుద్దీన్, పొలా కోటేశ్వరరావు గుప్తా తదితరులు పాల్గొన్నారు.