నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డితో కలసి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ప్రగతి భవన్‌లో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటల్‌ను కరోన వైద్య సేవలకు వినియోగిస్తున్న నేపథ్యంలో మరిన్ని సదుపాయాలు కల్పించి ఇతర వైద్య సేవలను సైతం అందించేలా చూడాలని కోరారు. ఇప్పటికే స్థానిక ప్రజలకు అందుబాటులో ఉన్న టిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేసి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిద్ధిదాలని కోరారు. న్యూరో, ఆర్థో, ప్లాస్టిక్ సర్జరీ, గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు జరిపేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అనేక రోగాలకు ఒకేచోట వైద్యం అందేలా టిమ్స్‌ను పునరుద్ధరించాలని కోరానన్నారు. రోగులను తరలించడానికి ర్యాంపు లను, లిఫ్టుల ఏర్పాటు, ఎస్టీపి, చెత్త డంపింగ్ , ఫైర్ సేఫ్టీ, పరీక్ష కేంద్రాలను, రేడియాలజీ యంత్రాల ఏర్పాటు అవసరాన్ని వివరించారు. ఐతే తమ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.